సీఎం జగన్‌తో టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల భేటీ

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్‌రెడ్డిలతో పాటు జెమిని కిరణ్‌లతో కూడిన బృందం సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  హుద్‌హుద్‌ తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం సినీపరిశ్రమ సాయంతో 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు.



ఇళ్ల నిర్మాణం పూర్తయినందున వాటిని ప్రారంభించి హుద్‌హుద్‌ సమయంలో ఇళ్లు కోల్పోయిన వారికి అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు. దీని కోసం తెలుగు సినీపరిశ్రమంతా రెండు రోజుల పాటు అన్ని కార్యక్రమాలు నిలిపివేసి, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టెలీథాన్‌ పేరుతో ప్రత్యేక షో నిర్వహించామని చెప్పారు. ఆ షో నిర్వహణ ద్వారా వచ్చిన రూ.15 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. ఆ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు పూర్తైందని.. అదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించామని చెప్పారు. పూర్తైన ఇళ్లను పేదలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందుకు సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.  చదవండి: విద్యుత్‌ రంగంలో పెట్టుబడులే లక్ష్యం: సీఎం జగన్‌