అమరావతి : కరోనా విపత్తు సమయంలో పేదలు ఉపాధి లేక ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు గురువారం నుంచి రాష్ట్రంలో రెండో విడత ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా బియ్యం, కేజీ శనగలను అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 13 జిల్లాల్లోని 29,783 చౌక దుకాణాల ద్వారా మొత్తం 1,47,24,017 కుటుంబాలకు బియ్యం, శనగలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే అన్ని చౌక దుకాణాలకు బియ్యం, శనగలను రవాణా చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరంను పాటించాలన్న నిబంధనల మేరకు రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుంపులుగా ఏర్పరకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలను తీసుకుంది. మొదటివిడత పంపిణీ సందర్బంగా కొన్నిచోట్ల రేషన్ కోసం కార్డుదారులు తొందరపడి ఒకేసారి దుకాణాల వద్దకు వచ్చిన పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది.
రెండోవిడత ఉచిత రేషన్ పంపిణీకి సర్వం సిద్దం