‘మామూలు ప్రపంచకప్‌ పోరాటం కాదిది’

హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టిన కరోనా పాజిటివ్‌ సంఖ్య తగ్గడం లేదు. రోజురోజుకు ఊహించని స్థాయిలో కేసుల సంఖ్య బయటపడుతున్నాయి. ఈ క్రమంలో భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ రవిశాస్త్రి స్పూర్తినిచ్చే సందేశాత్మకమైన వీడియోను తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  




‘కరోనాను ఎదుర్కొవడం అనేది ప్రపంచకప్‌ గెలవడం కోసం చేసే పోరాటం వంటింది. దీన్ని గెలవడానికి సర్వస్వం ధారపోయడానికి సిద్దంగా ఉండాలి. ఇది మామూలు ప్రపంచకప్‌(కరోనా) కాదు. ఇప్పటివరకు మనం చూసిన అన్ని ప్రపంచకప్‌లకు అమ్మ వంటిది ఈ కరోనా.  ఇక్కడ కేవలం 11 మంది మాత్రమే పోరాటం చేయరు. 130 కోట్ల మంది ఈ పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తారు. అయితే ఈ పోరాటంలో గెలవడం అంత సులభం కాదు. కానీ ప్రాథమిక సూత్రాలు పాటిస్తే విజయం మనదే. ప్రపంచకప్‌ గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని వ్యూహాలు రచిస్తామో.. కరోనాపై విజయం సాధించడానికి అలాంటి ప్రణాళికలే రచించాలి.